యుగనేత నాటి ప్రోత్సాహం... స్థానిక పోరులో మళ్లీ ప్రధాన ఘట్టం!
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
రాజకీయ రంగంలో ప్రజానుబంధం, నిరంతర శ్రమ ద్వారా తమదైన ముద్ర వేసే నాయకులు కొందరే ఉంటారు. ఆ వరుసలోనే చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజాసేవలో కొనసాగుతున్న లేబాకు మోహన్ రెడ్డి పయనం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా 1987 నాటి మండల పరిషత్ ఎన్నికల సమయంలో మోహన్ రెడ్డి తన బావగారైన నాగిరెడ్డి నరసింహారెడ్డి మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే క్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. నాటి నుంచి చిట్వేల్ మండల ప్రాంత ప్రజలతో, రాజకీయ పరిణామాలతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది.
మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో 2001 సంవత్సరం ఎంతో ప్రాధాన్యమైన ఘట్టంగా నిలిచింది. నాటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక పోరులో నిలిచేందుకు పలువురు నాయకులు సంకోచిస్తున్న తరుణంలో, అప్పటి ప్రజా నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనను కడప అతిథి గృహానికి పిలిపించి మాట్లాడారు. మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు పోటీకి సిద్ధం కావాలని ఇచ్చిన పిలుపు ఆయన ప్రస్థానంలో పెద్ద మలుపుగా మారింది. ఆ ప్రోత్సాహంతోనే అదే ఏడాది దేవమాచుపల్లి గ్రామ సర్పంచ్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత కుటుంబ పరంగా కూడా ప్రజా ప్రాతినిధ్యం కొనసాగింది. 2005లో మోహన్ రెడ్డి సతీమణి చిట్వేల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించగా, ఆయన మాతృమూర్తి లేబాకు పార్వతమ్మ 2006, 2012 సంవత్సరాల్లో దేవమాచుపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవ అందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో భాగంగా 2021లో మోహన్ రెడ్డి మరోసారి దేవమాచుపల్లి సర్పంచ్‌గా గెలుపొందగా, అదే సమయంలో చిట్వేల్ మండల అధ్యక్ష పదవి స్థానానికి ఆయన సహచరుడైన టంగుటూరు చంద్ర ప్రాతినిధ్యం వహించారు.
పావు శతాబ్దపు రాజకీయ అనుభవంతో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మోహన్ రెడ్డి ప్రస్తుతం 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో చిట్వేల్ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీకి దిగడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నాడు ప్రజా నాయకుడి ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆ ఎన్నికల ప్రయాణం, పాతికేళ్ల తర్వాత ఈ స్థానిక పోరుతో మరో కొత్త అధ్యాయానికి వేదికవుతోంది.
Andhra
యుగనేత నాటి ప్రోత్సాహం... స్థానిక పోరులో మళ్లీ ప్రధాన ఘట్టం!
Quick Summary:
యుగనేత నాటి ప్రోత్సాహం... స్థానిక పోరులో మళ్లీ ప్రధాన ఘట్టం!