పేదల పొట్టగొట్టే కక్షసాధింపులకు స్వస్తి పలకాలి: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల ధ్వజం
రైల్వేకోడూరు అక్టోబర్ 8 జై భీమ్ వాయిస్ టుడే: పేద ప్రజల జీవనోపాధిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం అత్యంత దారుణమని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీ ప్యారడైజ్ ఆవరణలో ఏళ్ల తరబడి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేద కుటుంబాల వ్యాపార సముదాయాలను రాత్రికి రాత్రి కూటమి ప్రభుత్వ నాయకులు, వారి అనుచరులు ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు స్వయం ఉపాధి పొందుతుంటే, మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సింది పోయి, రాత్రికి రాత్రి వారి దుకాణాలను కూల్చివేసి రోడ్డున పడేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులైనా, ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకునే ముందు పేదల జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. తాను ఇరవై ఏళ్లపాటు శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో ఎన్నడూ ఇలాంటి దుశ్చర్యలు జరగలేదని గుర్తుచేశారు. నియోజకవర్గానికి మంచి చేస్తారని ప్రజలు గెలిపిస్తే, ప్రస్తుత శాసనసభ్యుడు నిరుపేదలకు మేలు చేయకపోగా ఇటువంటి అరాచక ఘటనలకు వత్తాసు పలకడం శోచనీయమన్నారు. కనీసం ఇన్‌చార్జ్ కూడా స్పందించి బాధితులకు అండగా నిలవకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
దుకాణాలపై దాడికి పాల్పడిన అరాచక మూకలను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మాదినేని వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, పూర్వ జెడ్పీటీసీ రత్నమ్మ, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రాజా (గని), రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ రామకృష్ణ, మందల శివయ్య, కరిముల్లా, ఆంజనేయులు, రత్తయ్య, అరుణమ్మ, రౌఫ్, శంకరయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Andhra
పేదల పొట్టగొట్టే కక్షసాధింపులకు స్వస్తి పలకాలి: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల ధ్వజం
Quick Summary:
పేదల పొట్టగొట్టే కక్షసాధింపులకు స్వస్తి పలకాలి: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల ధ్వజం
