గ్రామీణ ఆడబిడ్డల విద్యకు మహర్దశ: పెనగలూరులో రూ.2.12 కోట్లతో నూతన విద్యా భవనం ప్రారంభం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 28 జై భీమ్ వాయిస్ టుడే: రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం
గ్రామీణ ప్రాంత ఆడబిడ్డల ఉన్నత చదువులకు మహర్దశ పడుతోంది. మండల కేంద్రంలో రూ.2.12 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల భవనాన్ని కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కా రూపానంద రెడ్డి, శాసనసభ్యుడు అరవ శ్రీధర్ వైభవంగా ప్రారంభించారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పచ్చని తోరణాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.
తొలుత విద్యాసంస్థ ప్రాంగణానికి చేరుకున్న నాయకులకు పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. భవన ప్రారంభం అనంతరం తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గదులను ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న భోజన వసతి, తాగునీరు, విద్యా సౌకర్యాలపై ఆరా తీసి, వారికి అందుతున్న విద్యా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ... ఆడబిడ్డలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థినులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
శాసనసభ్యుడు అరవ శ్రీధర్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించేలా అధునాతన మౌలిక వసతులు కల్పించడం ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. మెరుగైన విద్య అందించడమే సమాజ భవిష్యత్తుకు చేసే అత్యంత విలువైన పెట్టుబడి అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కస్తూరి విశ్వనాథ నాయుడు, తాతం శెట్టి నాగేంద్ర, పంతగాని నరసింహ ప్రసాద్, కేకే చౌదరి, విశ్వేశ్వర నాయుడు, నారాయణ రెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ నాయుడు, బాలకృష్ణ, కాపేర్ల నాగార్జున, గుత్తి నరసింహతో పాటు విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
గ్రామీణ ఆడబిడ్డల విద్యకు మహర్దశ: పెనగలూరులో రూ.2.12 కోట్లతో నూతన విద్యా భవనం ప్రారంభం
Quick Summary:
గ్రామీణ ఆడబిడ్డల విద్యకు మహర్దశ: పెనగలూరులో రూ.2.12 కోట్లతో నూతన విద్యా భవనం ప్రారంభం


