జైభీమ్ వాయిస్ టుడే నందిగామ, సెప్టెంబర్ 19:
మాదిగలకు కేటాయించిన చెప్పులు కుట్టే, డప్పు కళాకారుల పెన్షన్లను ఇతరులకు కేటాయించడాన్ని అడ్డుకుంటామని MRPS ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొండపాటి సుధాకర్ మాదిగ హెచ్చరించారు. శనివారం నందిగామ ఆర్డీవో కార్యాలయంలో AO కి మాదిగ కులస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాదిగలు ఆది జాంబవంతుని వారసులమని, సమాజాన్ని దుర్గంధం నుండి కాపాడుతూ చనిపోయిన జంతువులను ఊరి బయటకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిన చరిత్ర తమదన్నారు. అలాగే డప్పు ద్వారా గ్రామ సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన ఘనత మాదిగలదని, అందుకే ప్రభుత్వం చెప్పు, డప్పు కళాకారులకు పెన్షన్లు కేటాయించిందన్నారు.
అయితే SC ల పేరుతో తమ కులవృత్తి పెన్షన్లను మాల కులస్తులకు కూడా ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. SC జాబితాలో 59 కులాలు ఉన్నా, ప్రతి కులానికి ప్రత్యేక వృత్తి ఉందని, మాలలకు నేత వృత్తి ఉంటే తమ పెన్షన్లు వారికి ఇవ్వడం కుట్రలో భాగమేనన్నారు. BC లలో 104 కులాలకు ఆయా కులాల అవకాశాలు ఆ కులాలకే ఇస్తున్నప్పుడు, SC లలో మాదిగల అవకాశాలను వేరే కులాలకు ఇవ్వడం సరికాదన్నారు. మాల కులంపై ప్రేమ ఉంటే వారి ఆస్తులు ఇవ్వాలి కానీ, మాదిగలకు రావాల్సిన పెన్షన్లను పక్కదారి పట్టించడం న్యాయం కాదని, దీనిపై ఏ స్థాయి ఉద్యమానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి వేల్పుల రమేష్ మాదిగ, చందర్లపాడు మండల ఇన్చార్జి కోట సత్యానందం మాదిగ, నూకపోగు జ్యోతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Andhra
మాదిగల పెన్షన్ల దోపిడీని అడ్డుకుంటాం: సుధాకర్ మాదిగ.
Quick Summary:
మాదిగల పెన్షన్ల దోపిడీని అడ్డుకుంటాం: సుధాకర్ మాదిగ.