రక్షకులే భక్షకులవుతుంటే శిక్షించేవారెవరు: చెరువుల గర్భాన్ని గుల్ల చేస్తున్న మట్టి మాఫియా ప్రతాపం!
ఓబులవారిపల్లి, సెప్టెంబర్ 20 భీమ్ వాయిస్ టుడే:
కళ్లముందే ప్రజాధనం దోపిడీకి గురవుతున్నా, ప్రకృతి వనరులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా అధికారులు మౌన ప్రేక్షక పాత్ర వహిస్తుండటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలాల్లో మట్టి మాఫియా తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా రెడ్డిపల్లి, రంగంపల్లి చెరువులే లక్ష్యంగా రాత్రింబవళ్లు తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల పర్వం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
చెరువుల్లోని సారవంతమైన పాత మట్టిని, విలువైన ఖనిజ సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, వ్యాపార ముసుగులో విచ్చలవిడిగా తోడేస్తున్నారు. ఒక్కో వాహనానికి వేయి నుంచి పన్నెండు వందల రూపాయల వరకు నిరుపేద రైతుల నుంచి వసూలు చేస్తూ, రోజుకు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దందా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. తవ్వకాల కారణంగా చెరువు గర్భంలో వెలసిన ప్రమాదకర లోతైన గోతులు రానున్న వర్షాకాలంలో పశువులకు, చిన్నారులకు మృత్యుకుహరాలుగా మారే ప్రమాదముంది.
ఇంత జరుగుతున్నా సంబంధిత మైనింగ్, రెవిన్యూ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాను అరికట్టి, మైనింగ్ అనుమతుల పరిధిలోకి తెస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుందని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ప్రజాసంఘాలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం నిద్రమత్తు వీడి తక్షణ చర్యలకు పూనుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra
రక్షకులే భక్షకులవుతుంటే శిక్షించేవారెవరు: చెరువుల గర్భాన్ని గుల్ల చేస్తున్న మట్టి మాఫియా ప్రతాపం!
Quick Summary:
రక్షకులే భక్షకులవుతుంటే శిక్షించేవారెవరు: చెరువుల గర్భాన్ని గుల్ల చేస్తున్న మట్టి మాఫియా ప్రతాపం!