కల్పిత నాయకుడు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి
ఓబులవారిపల్లిలో కొవ్వొత్తులతో దళిత నాయకుల నిరసన
రైల్వే కోడూరు, సెప్టెంబర్ 12 జై భీమ్ వాయిస్ టుడే:
మండల కేంద్రమైన ఓబులవారిపల్లి సమీపంలోని చిన్నవరంపాడు క్రాస్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం సాయంత్రం దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. "కల్పిత నాయకుడు అంబేద్కర్" పేరుతో వెలువరించనున్న పుస్తకాన్ని తక్షణమే రద్దు చేయాలని, దాన్ని రచించిన అమర ప్రసాద్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ వాది, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బి.ఆర్. రమణ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పుస్తకం రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా, కులమతాలకు అతీతంగా పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ మేధావీ అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించలేదని, అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి భావితరాలను తప్పుదోవ పట్టించే యత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు ఆందోళనలు తీవ్రతరం చేయడం ఖాయమని హెచ్చరించారు.
అంబేద్కర్ వాదులు పోలమనేని మల్లికార్జున, పాణ్యం చిన్నయ్య, గొంజిపల్లి హరి, డేగల మహేశ్వర, నారాయణ మాట్లాడుతూ, సాధారణ నాయకులపై వ్యాఖ్యలు చేస్తే తక్షణమే అరెస్టులు చేసే ప్రభుత్వం, దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడిపై అనుచిత వ్యాఖ్యలు వస్తుంటే మౌనం వహించడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై స్పందించకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలను దిగజార్చేలా సాగుతున్న ఈ పన్నాగాన్ని తిప్పికొడతామని చెప్పారు.
ఈ నిరసన కార్యక్రమంలో దళిత నాయకులు గాజుల శ్రీనివాసులు, పోలంనేని చంద్రయ్య, అంబారి శ్రీనివాసులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Andhra
కల్పిత నాయకుడు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి ఓబులవారిపల్లిలో కొవ్వొత్తులతో దళిత నాయకుల నిరసన
Quick Summary:
కల్పిత నాయకుడు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి ఓబులవారిపల్లిలో కొవ్వొత్తులతో దళిత నాయకుల నిరసన
