మరమ్మతుల పేరిట మరణమృదంగం: కడప-చెన్నై రహదారిపై వర్తకులు, బాటసారుల నరకయాతన
కడప - చెన్నై జాతీయ రహదారి (ఎన్హెచ్ 716) విస్తరణ, ఆధునీకరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు సంస్థ అలసత్వం కలసి ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. రాజంపేట నుండి తిరుపతి వరకు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి, పనుల బాధ్యతను "కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్" సంస్థకు అప్పగించింది. అయితే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు భద్రతా చర్యలు పూర్తిగా విస్మరించడంతో ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
రహదారి పునరుద్ధరణలో భాగంగా తారు వేసేందుకు వీలుగా యంత్రాలతో పాత రహదారిపై పెద్ద ఎత్తున గాట్లు పెట్టారు. అయితే గాట్లు పెట్టి తారు వేయడం పూర్తిగా మరిచిపోయారు. దీనివల్ల గోతులు తేలి, ప్రయాణిస్తున్న వాహనాల చక్రాలు పగిలిపోయి వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రహదారి ఇరువైపులా ఉన్న దుకాణాల వద్ద వర్షపు నీరు కొలనులను తలపిస్తోంది. వ్యాపార సముదాయాల ముందు నీరు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు రాక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. బురదమయమైన రోడ్డుపై నడవలేక చిన్నపిల్లలు, వృద్ధులు జారిపడి గాయాలపాలవుతున్నారు.
స్థానిక ఎలక్ట్రికల్ దుకాణదారుడు శ్రీనివాసులురెడ్డి ఈ దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాలతో రోడ్డును తవ్వి వదిలేయడం వల్ల నిత్యం దుమ్ము ధూళితో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని, వ్యాపారాలు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వహించడం, పర్యవేక్షించాల్సిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, ఏర్పడిన గుంతలను పూడ్చి వెంటనే తారు రహదారి పనులను పూర్తి చేయాలని, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra
మరమ్మతుల పేరిట మరణమృదంగం: కడప-చెన్నై రహదారిపై వర్తకులు, బాటసారుల నరకయాతన
Quick Summary:
మరమ్మతుల పేరిట మరణమృదంగం: కడప-చెన్నై రహదారిపై వర్తకులు, బాటసారుల నరకయాతన