నేలల స్వభావం నుండి సాగు మెళకువల వరకు: క్షేత్రస్థాయి పరిశోధనలో అనంతపురం హార్టికల్చర్ విద్యార్థినులు
రైల్వే కోడూరు అక్టోబర్ 6 జై భీమ్ వాయిస్ టుడే:
ఉద్యానవన పంటల సాగు విధానాలు, మట్టి స్వభావం, క్షేత్రస్థాయి సవాళ్లపై ప్రత్యక్ష అవగాహన పెంచుకునేందుకు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ విద్యార్థినులు ప్రత్యేక గ్రామీణ క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు ఎస్. పూజిత, శ్రీరాజశ్రీ, కే. ముక్కలత, కే. సుభాషిని, బి. కావ్య, టి. హేమలత, ఎస్. రోషిని ఈ శిక్షణలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అనంతరాజుపేటలోని ఉద్యాన పరిశోధనా స్థానానికి ప్రతివారం పయనం కానున్నారు. అక్కడ నిపుణులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రయోగశాల పరిజ్ఞానాన్ని, ఆధునిక సాగు పద్ధతులను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు.
కేవలం పరిశోధనా స్థానాలకే పరిమితం కాకుండా నేరుగా అన్నదాతల వద్దకే వెళ్తూ నేలల అనుకూలత, విత్తన ఎంపిక, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణతో పాటు సమగ్ర పంట సాగు పద్ధతులపై లోతైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో రైతుల అనుభవాలను, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సిద్ధాంత గ్రంథాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుండడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Andhra
నేలల స్వభావం నుండి సాగు మెళకువల వరకు: క్షేత్రస్థాయి పరిశోధనలో అనంతపురం హార్టికల్చర్ విద్యార్థినులు
Quick Summary:
నేలల స్వభావం నుండి సాగు మెళకువల వరకు: క్షేత్రస్థాయి పరిశోధనలో అనంతపురం హార్టికల్చర్ విద్యార్థినులు