హత్యరాల శోభ: బహుదా నదీ తీరాన నేత్రపర్వంగా షోడశ హారతులు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 27 జై భీమ్ వాయిస్ టుడే:
సాయం సంధ్యావేళ శంఖారావాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర బహుదా నదీ తరంగాలపై దివ్య దీపకాంతులు ప్రతిఫలించగా హత్యరాల క్షేత్రం అలౌకిక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పరశురాముడికే మాతృహత్యా పాతకం నుంచి విముక్తిని ప్రసాదించిన పరమ పవిత్ర శ్రీ హరిహరుల నిలయమైన ఈ క్షేత్రం శనివారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఉత్తర భారతదేశంలోని కాశీ గంగా హారతి వైభవాన్ని తలపిస్తూ ఇక్కడ బహుదా నదీ తీరంలో నిర్వహించిన షోడశ హారతులు, గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆలయ హోమాలు, ఆధ్యాత్మిక సంగీత కచేరీలు, భజనల హోరుతో క్షేత్ర పరిసరాలు మారుమోగాయి.
ఈ దివ్య మహోత్సవంలో రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి రాజకీయ ఆర్భాటాలు, ప్రచార హంగామాకు తావివ్వకుండా ఒక సామాన్య భక్తునిలా ఆయన నదీమతల్లికి, స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రణామాలుర్పించి హారతి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మంగళ హారతుల కాంతుల్లో బహుదా తీరం సాక్షాత్తు కైలాస-వైకుంఠాలను తలపించగా, భక్తజనం నేత్రపర్వంగా ఆ దృశ్యాన్ని తిలకించి గిరి ప్రదక్షిణం చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ఈ పురాతన క్షేత్ర విశిష్టతను భావితరాలకు అందిస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పలువురు స్పష్టం చేశారు. ఈ అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాన్ని కళ్లారా చూసి తరించేందుకు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చారు.
Andhra
హత్యరాల శోభ: బహుదా నదీ తీరాన నేత్రపర్వంగా షోడశ హారతులు హాజరైన జగన్ మోహన్ రాజు
Quick Summary:
హత్యరాల శోభ: బహుదా నదీ తీరాన నేత్రపర్వంగా షోడశ హారతులు హాజరైన జగన్ మోహన్ రాజు
