ఆధ్యాత్మిక హోరులో విఘ్నేశ్వరుని శోభాయాత్ర: రూ.26 వేలకు ప్రసాద లడ్డు కైవసం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 16 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం నేతివారిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో పరవశించింది. గ్రామంలో గత మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన లంబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు అందించారు. మంగళవారం సాయంత్రం గ్రామస్తులందరి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన స్వామివారి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. డప్పు వాయిద్యాల మోతలు, గగనాన్ని తాకే బాణసంచా పేలుళ్ల నడుమ భక్తులు ఉత్సాహంగా అడుగులు వేశారు. ఒకరికొకరు కుంకుమ పూసుకుంటూ, వసంతాలు చల్లుకుంటూ పండగ వాతావరణంలో ఊరేగింపు సాగింది. గ్రామ వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రకు ఊరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి ప్రసాద లడ్డు వేలం పాట పోటాపోటీగా సాగింది. తీవ్ర పోటీ నడుమ తుమ్మల వేణుగోపాల్ రూ. 26,000 లతో ఈ లడ్డును పాడుకుని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు బుర్రు సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు యాదవ్, నాగయ్య యాదవ్ తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వేడుకను జయప్రదం చేశారు.
Andhra
ఆధ్యాత్మిక హోరులో విఘ్నేశ్వరుని శోభాయాత్ర: రూ.26 వేలకు ప్రసాద లడ్డు కైవసం
Quick Summary:
ఆధ్యాత్మిక హోరులో విఘ్నేశ్వరుని శోభాయాత్ర: రూ.26 వేలకు ప్రసాద లడ్డు కైవసం