సమస్యాత్మక కేంద్రాలపై డ్రోన్ కన్ను!
రైల్వే కోడూరు అక్టోబర్ 4 జై భీమ్ వాయిస్ టుడే: రాబోయే ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో భద్రతా వలయాన్ని బిగిస్తోంది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి. శ్రీనివాసులుతో కలిసి ఆదివారం కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఓబులవారిపల్లి, చిట్వేల్, పుల్లంపేట మండలాల్లోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.
ఎన్నికల వేళ ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ముందస్తు వ్యూహంలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఆధునిక సాంకేతికతను రంగరించడం గమనార్హం. డ్రోన్ కెమెరాల సహాయంతో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, అనుసంధాన రహదారులు, భౌగోళికంగా సున్నితమైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా జల్లెడ పట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల ఆటకట్టించేందుకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు డ్రోన్ నిఘా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రహరీ గోడల పరిరక్షణ, విద్యుత్ వెలుగులు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసే ర్యాంపులు, అత్యవసర ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలకు వీలుగా ఉన్న రహదారుల పరిస్థితిని పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పక్కా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పుల్లంపేట ఎస్ఐ వి. చిన్న రెడ్డెప్ప, చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ మరియు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
సమస్యాత్మక కేంద్రాలపై డ్రోన్ కన్ను!
Quick Summary:
సమస్యాత్మక కేంద్రాలపై డ్రోన్ కన్ను!