జైభీమ్ వాయిస్ టుడే విజయవాడ, సెప్టెంబర్ 26:
పెనమలూరు మండలం కానూరు పరిధిలోని సర్వే నంబర్ 36లో కోట్ల విలువైన భూమిని కాజేయడానికి నకిలీ పత్రాలతో మోసానికి పాల్పడిన కేసును పెనమలూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు.విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావు దంపతులకు కానూరులో 1600 గజాల స్థలం ఉంది. వారి కుమార్తె హిమబిందు అమెరికాలో నివసిస్తున్న విషయాన్ని ఆసరాగా చేసుకున్న విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ ముఠా.. అందులో 800 గజాల స్థలాన్ని కాజేయడానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.ముందుగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ కాపీని సంపాదించిన నిందితులు.. బతికున్న సుబ్బారావు దంపతులు మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం అమెరికాలో ఉన్న అసలు కుమార్తె స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళను తీసుకొచ్చి, ఆమె పేరుతో నకిలీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు.ఆ మహిళ ఆధార్‌ను ఉపయోగించి ఈ ఏడాది జనవరిలో మందాడి ఆదిరెడ్డి పేరుతో జీపీఏ, ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా అసలు యజమాని సుబ్బారావుకు అనుమానం వచ్చి పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ నెల 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితులు: మైనంపాటి మణికుమార్ (ప్రధాన సూత్రధారి), మందాడి ఆదిరెడ్డి, ఉప్పల భాస్కరరావు, ఆర్‌ఎంపీ శివ, కాసాని అమలేశ్వరరావు.ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. జిరాక్స్ కాపీల ఆధారంగానే కోట్ల విలువైన స్థలాలను కాజేయడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి ముఠాల పట్ల ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ తమ ఆస్తులకు దూరంగా ఉన్న భూ యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పత్రికా సమావేశంలో పెనమలూరు సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు సుధాకర్, సందీప్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
పెనమలూరులో సంచలన భూ కుంభకోణం.. ఐదుగురు అరెస్ట్
Quick Summary:
పెనమలూరులో సంచలన భూ కుంభకోణం.. ఐదుగురు అరెస్ట్