భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో ఘనంగా అన్నదానం అలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు
రైల్వేకోడూరు, సెప్టెంబర్ 18 జై భీమ్ వాయిస్ టుడే:
చిట్వేలి పట్టణ పరిధిలోని కుమ్మరవీధి వినాయక మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం కంటికి రెప్పలా అత్యంత ఘనంగా సాగింది. కేఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన పెయింట్ కాంట్రాక్టర్ ఆలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు ఈ దాతృత్వ కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహించారు. నవరాత్రుల వేళ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకలో సుమారు 400 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. విచ్చేసిన భక్తులకు ఆలిశెట్టి పెంచలయ్య కుటుంబీకులు స్వయంగా వడ్డనలు చేస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు.
విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున అన్నదానం చేపట్టే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆలిశెట్టి పెంచలయ్య తెలిపారు. ఆ బొజ్జ గణపయ్య దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై నిరంతరం ఉండాలని, రైతాంగానికి, వివిధ వృత్తిదారులకు నిరంతరం ఉపాధి లభించి ప్రశాంత జీవనం సాగించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంట పొలాలు పచ్చదనంతో వర్ధిల్లాలని, ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని లంబోదరుడిని వేడుకున్నట్లు వెల్లడించారు.
కాగా, ఆలిశెట్టి పెంచలయ్య ప్రాంతీయంగా నిరుపేదలకు, ప్రజా సమస్యలకు తక్షణమే స్పందిస్తూ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలకు ఉచితంగా రంగులు వేయిస్తూ ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తన వద్ద పనిచేసే దాదాపు 80 మంది పెయింటింగ్ కార్మికులకు ప్రతి ఏటా సొంత ఖర్చులతో దుస్తులు పంపిణీ చేయడంతో పాటు వారి కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తున్న ఆలిశెట్టి పెంచలయ్య సేవలను స్థానికులు కొనియాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు పూర్తి చేసిన కుమ్మరవీధి కమిటీ సభ్యులకు, ఉత్సాహంగా పాల్గొన్న యువతకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Andhra
భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో ఘనంగా అన్నదానం అలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు
Quick Summary:
భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో ఘనంగా అన్నదానం అలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు
