కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే!
రైల్వే కోడూరు సెప్టెంబర్ 23 జై భీమ్ వాయిస్ టుడే:
భూకబ్జాలను తక్షణమే అరికట్టి, వి.వి. కండ్రికలోని ప్రభుత్వ భూములను దళితులు, గిరిజనులకు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో ప్రజా సంఘాలు సమరశంఖం పూరించాయి. ఈ నెల 28న వి.వి. కండ్రిక నుంచి రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం వరకు తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం వి.వి. కండ్రిక గ్రామంలోని 130, 142 సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి నిరుపేదలకు పపంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గ్రామంలో దళితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పందికాళ్ల మణి ప్రసంగించారు.
అధికార పార్టీ, రెవెన్యూ అధికారుల అండదండలతోనే గ్రామంలో భారీగా భూకబ్జాలు సాగుతున్నాయని నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందలాది ఎకరాల భూమిని రాత్రింబవళ్లు యంత్రాలతో సమతలం చేస్తూ కబ్జాకు పాల్పడుతుంటే రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం, యంత్రాలను స్వాధీనం చేసుకోకపోవడం వెనుక అధికారుల కుమ్మక్కు రాజకీయం కనిపిస్తోందని విమర్శించారు. గతంలో మైనింగ్ లీజు పేరిట ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించగా, ప్రజాపోరాటాల ఫలితంగానే ఆ ప్రయత్నం విఫలమైందని గుర్తుచేశారు. ఆ సమయంలో దళితులకే ఈ భూములను ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు, నేడు మాట తప్పి ఆక్రమణదారులకు కొమ్ముకాయడం దారుణమన్నారు.
దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, ప్రభుత్వ భూములపై పేదల హక్కును సాధించుకోవడానికి సోమవారం నాటి పాదయాత్రను దళిత, గిరిజన లోకం జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొజ్జ శివయ్య, సీఐటీయూ నాయకులు నగిరిపాటి ఆనంద్, రైతు సంఘం నాయకులు నాగేశ్వరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, దళితులు పాల్గొన్నారు.
Andhra
కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే!
Quick Summary:
కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే!